వరదసాయం కోసం మీసేవకు వచ్చి మృతిచెందిన మహిళ చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సాయం పేరుతో వరద బాధితుల జీవితాలతో తెరాస రాజకీయం చేస్తోందని విమర్శించారు. దీనికి గ్రేటర్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మహిళలు, పిల్లలు మీసేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే కనీసం వారిని గుర్తించేందుకు సిద్ధంగా లేరని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తెరాసకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
వరదసాయం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం: రేవంత్రెడ్డి - హైదరాబాద్ తాజా సమాచారం
వరదసాయం ముసుగులో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి విమర్శించారు. ఓ మీసేవ కేంద్రం వద్ద మహిళ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వమే సాయం నిలిపివేయించి డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు.
ప్రభుత్వమే సాయం నిలిపివేయించింది..
బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే కమిషన్లు రావనే ఉద్దేశంతో ప్రభుత్వమే వరదసాయాన్ని నిలిపివేయించిందని ఎంపీ ఆరోపించారు. నగదు పంపిణీ ద్వారా రూ.250 కోట్లు తెరాస నేతల జేబుల్లోకి వెళ్లాయని తెలిపారు. కాంగ్రెస్ ఆందోళన చేయడంతోనే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. ఇదంతా కేసీఆర్, కిషన్రెడ్డి ఆడుతున్న డ్రామాగా రేవంత్రెడ్డి అభివర్ణించారు. మీసేవ వద్ద మృతిచెందిన హకీంపేట మహిళ మున్నవర్కు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే వరదసాయం అందించాలన్నాారు.