Revanth On Jubilee Hills Case: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో వాహన యజమానుల వివరాలను సీపీ సీవీ ఆనంద్ ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్ల యజమానులపై తీసుకున్న చర్యలేంటి?
ఈ కేసులో బాధితులు, నిందితులు ప్రయాణించిన బెంజి, ఇన్నోవా కార్లే కీలక ఆధారాలని రేవంత్ రెడ్డి అన్నారు. మైనర్లు వాహనాలు నడిపినప్పుడు మోటర్ వాహన చట్టం 133 ప్రకారం యజమానులకు నోటీసులు ఇచ్చి, వారిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి జరిగిన వివరాలు తెలియజేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బెంజికారు పబ్ వరకు వెళ్లిన తర్వాత ఇన్నోవాలో బయల్దేరారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారని వివరించారు. మార్చి 20 నుంచి మే 28వ తేదీ సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకు మాత్రమే విచారణ అధికారిగా సీపీ మీడియాకు తెలిపారన్నారు. అసలు కథ మొదలైంది మే 28న 7.53 గంటల తర్వాతేనని రేవంత్ వెల్లడించారు. బాధితురాలిని తండ్రి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కార్లలో జరిగిన ఘటన, పెద్దమ్మ గుడి ప్రాంతంలో జరిగిన తంతంగం వివరాలు.. దీనికి సంబంధించిన వాహనాలు ఎక్కడివి, వావాహనాల యజమానులమీద తీసుకున్న చర్యలేమిటో సీవీ ఆనంద్ చెప్పకుండా కప్పిపుచ్చారని ఆరోపించారు.
మోటార్ వాహనాల చట్టం ప్రకారం కార్ల యజమానులపైనా కేసు పెట్టాలి. అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమని సీపీ స్వయంగా చెప్పారు. ప్రభుత్వ కారును అసాంఘిక చర్యలకు ఉపయోగిస్తే ప్రజాప్రతినిధిపై ఎందుకు కేసు పెట్టలేదు. వాహనాల యజమానులపై కేసు ఎందుకు పెట్టలేదు, పేర్లు ఎందుకు చెప్పలేదు. మార్చి 26 నుంచి మే 28 వరకు జరిగిన ఘటనలు మొత్తం చెప్పారు. మే 28 తర్వాత జరిగిన ఘటనలను సీపీ పూర్తిగా ఎందుకు చెప్పలేదు. ఎంఐఎం ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పిల్లలు కేసులో నిందితులుగా ఉన్నారు. హత్యలు, అత్యాచారాల్లో కూడా తెరాస, ఎంఐఎం పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అత్యాచారం కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారు. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
బెంజికారు ఎవరిదో సీపీ చెప్పలేదు...:బెంజికారు ఎంఐఎంకు సంబంధించిన వారిదని ఆరోపణలు వస్తున్నప్పడు సీవీ ఆనంద్... మెర్సిడిస్ బెంజికారు యజమాని ఎవరో చెప్పలేదని రేవంత్ అన్నారు. ఎంవీ యాక్టు 133 ప్రకారం మైనర్లు కార్లు నడిపితే యజమానులకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైనర్లు కార్లు నడపకపోతే ఘటనకు సహకరించిన వాహనాల యజమానులపై కూడా పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమని సీవీ ఆనంద్ స్పష్టంగా చెప్పారని.. మైనర్లందరూ కలిసి కారు పెద్దమ్మగుడి ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పారని వెల్లడించారు. వాహన యజమానుల వివరాలను సీవీ ఆనంద్ ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వ వాహనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తే కారుకు సంబంధించిన వివరాలను ఎందుకు కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. అత్యాచారం కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారని.. వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఇన్నోవా కారు ఎక్కడుంది? ఇన్నోవా కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్ ఎవరు తొలగించారో చెప్పాల్సిన అవసరముందన్నారు. రేప్ ఘటనతో పాటు ఉద్దేశపూర్వకంగా ఆధారాలు చెరిపే ప్రయత్నం చేస్తున్నారని.. వాహనాన్ని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో పోలీసులు వెల్లడించలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.