తెలంగాణ

telangana

ETV Bharat / state

MP KOMATI REDDY: 'రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ను'

నూతన పీసీసీ నియామకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP KOMATIREDDY).. ఇకపై రాజకీయపరమైన అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్నారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

mp komatireddy venkat reddy
mp komatireddy venkat reddy

By

Published : Jun 28, 2021, 9:20 PM IST

ఇప్ప‌టి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌నని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP KOMATIREDDY) అన్నారు. ఇక‌పై ప్ర‌జా స‌మస్య‌లు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటానని... త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దని కోరారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వీలైనంత ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపడుతానని... నల్గొండ జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా తన తలుపు తట్టొచ్చని సూచించారు.

ఏం జరిగిందంటే..

తెలంగాణ పీసీసీ (tpcc) అధ్యక్షుడిగా మాల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడంపై పలువురు కాంగ్రెస్​ నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రేవంత్​ పేరు ప్రకటించిన వెంటనే మేడ్చల్​ జిల్లా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోందని ఎంపీ కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి మర్రి శశిధర్‌ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా మాల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు దిల్లీ వెళ్లాకా తెలిసినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ రాష్ట్ర నేతలకు ఫోన్‌ చేశారు. పార్టీ నేత మల్లు రవికి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్‌ చేశారు. హైకమాండ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఠాగూర్‌ పేర్కొన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించి హైకమాండ్‌కు పంపారు.

ఇదీ చూడండి:Komati Reddy: టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ABOUT THE AUTHOR

...view details