MLC Jeevan Reddy on paddy: ముఖ్యమంత్రి కేసీఆర్.. రైసు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం చెబితే రైతుల పరిస్థితి ఏంటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. నెలల తరబడిగా కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తుంటే... పరిస్థితిపై సమీక్షించే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో (paddy grains issue in telangana) 'రా' రైస్ కొనేందుకు రూ. 5వేల కోట్లు ఖర్చవుతుందని... రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ మాత్రం భరించలేదా అని మండిపడ్డారు.
రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలి
రోడ్లపై రైతులు పడిగాపులు కాస్తుంటే మంత్రులు ఎక్కడ ఉన్నారు.? రైతులకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వాలి. ఏ పంటను పండించాలో వారికే వదిలిపెట్టాలి. ఎక్కడైనా నేల స్వభావానికి అనుగుణంగానే పంటలు వేస్తారు. రైసు మిల్లర్లను ఎందుకు అదుపుచేయలేకపోతున్నారు.? రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా.? ఇంతవరకూ ఒక్క మంత్రి కూడా కల్లాలను సందర్శించలేదు. ప్రధాని అపాయింట్మెంట్ కోరకుండా కేసీఆర్ దిల్లీకి ఎందుకు వెళ్లారు.? కేసీఆర్ దిల్లీకి వెళ్లింది.. కేంద్రం మెడలు వంచడానికా.. వంచుకొని రావడానికా.? ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయం మాత్రమే కావాలి. -జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ