ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదని కేంద్రం ఆరోపిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యమం చేస్తే తాము మద్దతిస్తామని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న శాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
ఉద్యోగాల భర్తీలో స్పష్టత లేదు: జీవన్ రెడ్డి
లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారని.. కానీ ఎన్ని భర్తీ చేశారో స్పష్టం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో ఉద్యమిస్తే తాము మద్దతుగా నిలుస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రంలో లక్షకు పైగా ఖాళీలు ఉంటే ఎన్ని భర్తీ చేశారో సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటుతో అదనపు ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించిందన్నారు. స్వయంగా సీఎం కేసీఆరే ఒప్పంద ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని అయన డిమాండ్ చేశారు. రైతులకు రూ.25వేల రూపాయల కంటే తక్కువ రుణం ఉన్న వారికే మాత్రమే రుణమాఫీ చేశారని.. మిగిలిన వారికి ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగులకు పీఆర్సీ, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులపై స్పష్టత లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.