Congress MLA Ticket Applications Telangana :శాసనసభ ఎన్నికలకు సమయాత్తమవుతున్న కాంగ్రెస్.. కీలక ఘట్టమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతకు పట్టంకట్టాలన్న ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు తమకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకున్నదంతా అపోహేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖరాఖండిగా చెప్పారు.
Telangana Congress MLA Ticket Applications 2023 :పార్టీ విధివిధానాలు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుందని వెల్లడించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka)తో కలిసి గాంధీభవన్‌లో దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్‌రెడ్డి ఎంపిక విధానాన్ని తెలియజేశారు. పార్టీ నిర్ణయించిన మేరకు తనతో సహా ఆశావహులంతా రుసుం చెల్లించి టికెట్ కోసం అర్జీ చేసుకోవాలని తేల్చి చెప్పారు. ఎస్సీ,ఎస్టీలకు రూ.25వేలు ఇతరులకు రూ.50వేలు ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ , స్క్రీనింగ్ కమిటీ , పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంతవరకు వడపోత కార్యక్రమం ఉంటుందన్నారు.
"ఈ నెల 25 తరవాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అర్జీలను సరిచూసి, నియోజకవర్గాలవారీగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ నమోదు చేస్తారు. ఇదివరకే జరుగుతున్న సర్వేలకు అనుగుణంగా, వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ మొత్తం స్టేట్ స్ర్కీనింగ్ కమిటీగా నియమించిన ముఖ్య కమిటీకి మేము సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఊహాగానాలకు తోవలేకుండా పార్టీ అంతర్గత సమావేశాలలో పారదర్శకతగా చర్చించి గెలుపు ప్రాతిపదికిన అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు