రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాదని.. బిజినెస్ పాలన నడుస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఐటీ అధికారులు దాడులు చేస్తే.. రూ.కోట్లు దొరికిన వ్యక్తిని రాజ్యసభకు ఎందుకు పంపారని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నానన్నారు. పార్థసారథి వెనక పెద్ద కుంభకోణం ఉందని.. తెరాస డబ్బులన్నీ పార్థసారథి వద్దే ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ సీట్లు ఎందుకివ్వలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. దీనిపై ప్రజలూ ఆలోచించాలని సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా కేసీఆర్ దిల్లీకి వెళ్తే.. మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని.. ఇదేం రాజకీయమనే అనుమానం కలుగుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. తెరాస, భాజపా, ఎంఐఎంల మధ్య రాజకీయ అక్రమ సంబంధం కొనసాగుతుందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఎంఐఎం నేత అసదుద్దీన్‌కు మెదక్‌లో పోటీ చేసే దమ్ముందా అన్న జగ్గారెడ్డి.. అసద్ ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బిజినెస్ పాలన నడుస్తుంది. ఐటీ అధికారులు దాడులు చేస్తే రూ.కోట్లు దొరికిన వ్యక్తిని రాజ్యసభకు ఎందుకు పంపారు. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ సీట్లు ఎందుకివ్వలేదని సీఎం కేసీఆర్‌ను అడుగుతున్నా. తెరాస, భాజపా, ఎంఐఎంల మధ్య రాజకీయ అక్రమ సంబంధం కొనసాగుతుంది. వారి మధ్య అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.-జగ్గారెడ్డి