Jaggareddy Comments On KCR: కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత కరెంట్ ఇస్తే దాన్నే తెరాస కొనసాగిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ మీద పెట్టారని గుర్తు చేశారు. తెరాస నేతలు పదేపదే కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారని... రూ. లక్ష రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లయినా సీఎం కేసీఆర్ రూ. లక్ష మాఫీ చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ తీరుపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రైతుల మీద కేసీఆర్ సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పంజాబ్ రైతుల వద్దకు వెళ్లిన కేసీఆర్.. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఇంటికి కూడా వెళ్లలేదని ధ్వజమెత్తారు. ఓట్లేసిన రైతుల పరామర్శకు వెళ్లని కేసీఆర్.. పంజాబ్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తెరాస, భాజపా, ఎంఐఎం మధ్య రాజకీయ సంబంధం కుదిరిందని ఎద్దేవా చేశారు. తెరాస వ్యతిరేక ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. రెమ్డిసివిర్పై ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయని.. పార్థ సారథి ఎపిసోడ్ ఆపేది లేదని జగ్గారెడ్డి అన్నారు. దానం నాగేందర్ ఏదేదో మాట్లాడారని.. నాగేందర్ ప్రశ్నకు అనేక అనుమానాలు వచ్చాయని.. వాటి మీద కూడా స్పందిస్తాన్నారు. పార్థసారథి రెడ్డి ఎపిసోడ్ ఆపేదిలేదని.. మరికొద్ది రోజుల్లో అన్ని విషయాలు బయటపెడతానని స్పష్టం చేశారు.