రాష్ట్రానికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కొవిడ్ విషయంలో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో భాజపాకు నలుగురు ఎంపీలు, ఓ కేంద్రమంత్రి ఉన్నా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల సంఖ్య పెంచాలని ఎందుకు అడగడం లేదన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
ఇంజక్షన్లు కావాలని కేంద్రాన్ని ప్రశ్నించండి: జగ్గారెడ్డి
కరోనా నియంత్రణలో రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్రానికి కేవలం మొక్కుబడిగా కేటాయింపులు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కంపెనీ ధరకే రెమ్‌డెసివిర్ లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలని సూచించారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే ఇంజక్షన్లు తయారు చేసే కంపెనీ ముందే ధర్నా చేస్తామన్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిపై ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ చోద్యం చూస్తోందా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోతుంటే కేంద్రం ఏ చేస్తోందని నిలదీశారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కూర్చుని మాట్లాడవద్దని... ధైర్యం ఉంటే కేంద్ర మంత్రి ఇంటివద్ద ధర్నాకు దిగాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని రుజువు చేస్తారా మంత్రిని ఉద్దేశించి జగ్గారెడ్డి విమర్శించారు.