Congress MLA Candidates Selections Process Delay : వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు వచ్చిన ఆశావాహుల దరఖాస్తుల నుంచి అభ్యర్థుల ఖరారు చేసేందుకు ప్రదేశ ఎన్నికల కమిటీ(PEC meeting) తొలి సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన గాంధీభవన్(Gandhi Bhavan)లో మూడు గంటలకు పైగా జరిగిన పీఈసీ భేటీలో అభ్యర్థులపై ఎలాంటి స్పష్టత రాలేదని సమాచారం. కానీ వాడీవేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మళ్లీ వచ్చే నెల 2న సమావేశమై ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో జాబితాను ఖరారు చేయాలని నిర్ణయించారు.
Congress Candidate Process Postponed : ఆ జాబితాను వచ్చే నెల 4న జరిగే పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అందజేసి చర్చిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు పేర్లను ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీ దిల్లీలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. అక్కడ ఆమోదం పొందిన తరువాత సెప్టెంబరు రెండో వారానికల్లా తొలి జాబితాను అధిష్ఠానం విడుదల చేయవచ్చని పీఈసీ అంచనా. ఎస్టీ, ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటిస్తే వారు ఎన్నికలకు సన్నద్ధమవడానికి సమయం ఉంటుందని కొందరు సభ్యులు సూచించారు.
"కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేసుకున్న ప్రతి అభ్యర్థి పూర్తి వివరాలు, వారికి పార్టీతో ఉన్న అనుబంధం, వారు అప్లై చేసుకున్న నియోజకవర్గంలో వారు నిర్వహించిన కార్యక్రమాలు అన్ని పరిగణలోకి తీసుకుంటాము. తర్వాత సెప్టెంబర్ 2న పీఈసీ సమావేశంలో సమర్పిస్తాము.బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తాము " - మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
పూర్తి వివరాలు లేకుండానే దరఖాస్తులు: 119 నియోజకవర్గాల నుంచి 1006 దరఖాస్తులు రాగా.. నియోజకవర్గాలవారీగా జాబితాను పీఈసీ సమావేశంలో సభ్యులకు అందజేశారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, జగిత్యాలనియోజకవర్గంలో జీవన్‌రెడ్డి మాత్రమే దరఖాస్తు చేశారు. 11 స్థానాలకు రెండేసి చొప్పున దరఖాస్తులు అందాయి. అత్యధికంగా ఇల్లెందు కోసం 32, తుంగతుర్తికి 23, కంటోన్మెంట్‌కు 21, మిర్యాలగూడకు 20, బోథ్ స్థానానికి 18 అర్జీ అందాయి. దరఖాస్తుదారులు కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఏ కేటగిరీకి చెందినవారనే కనీస వివరాలు లేకుండా పేర్లు ఇస్తే ఎలా ఎంపిక చేయాలని జీవన్‌రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి రేవంత్‌రెడ్డి బదులిస్తూ.. అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయడానికి ఏఐసీసీ ఒక నమూనా పత్రం పంపిందని, దానిలో ఉన్న వివరాల ప్రకారం సూచించాలని కోరారు.