తెలంగాణ

telangana

Cong Leaders On Agnipath: 'అగ్నిపథ్​ను వెంటనే రద్దు చేయాలి'

Cong Leaders On Agnipath: రక్షణశాఖలో కాంట్రాక్ట్‌ విధానం తీసుకురావటం దారుణమైన విషయమని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ గాంధీ భవన్​ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ విధానం రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

By

Published : Jun 19, 2022, 3:18 PM IST

Published : Jun 19, 2022, 3:18 PM IST

Cong Leaders On Agnipath
కాంగ్రెస్‌ నేతలు

Cong Leaders On Agnipath: అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమం జరుగుతోందని.. ఇక్కడ రాజకీయ జోక్యం లేదని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. అగ్నిపథ్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. పార్లమెంటులో బిల్లు పెట్టి చర్చించకుండా.. డిఫెన్స్‌లో కొత్త విధానాన్ని ఏవిధంగా తీసుకొస్తారని ప్రశ్నించారు. మోదీ క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దేశమంతా నిరసనలతో అట్టుడుకుతోందని.. దేశాన్నిరక్షించే జవానుకే ఇప్పుడు కష్టం వచ్చిందని ఆరోపించారు. మోదీ తెచ్చే ప్రతి పథకం తన స్నేహితులు అదాని, అంబానీల కోసమేనని ధ్వజమెత్తారు. పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని నాలుగేళ్లకే తీసుకోవడం అన్యాయమన్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు, మాజీ మంత్రి గీతారెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొన్నారు.

దమ్ముంటే వరంగల్​ రండి: జగ్గారెడ్డి

సికింద్రాబాద్‌ ఘటనపై భాజపా నాయకుల తీరును పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గాంధీభవన్‌లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న జగ్గారెడ్డి భాజపా నాయకులకు సవాల్‌ విసిరారు. ధైర్యం ఉంటే కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ వరంగల్‌ రావాలని సవాల్‌ విసిరారు. అగ్నిపథ్ రద్దయ్యే వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపథ్‌ ఉద్యమం భాజపా పాలిత రాష్ట్రాలైన యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ కాల్పుల ఘటనకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. మృతుడు రాకేష్‌ మృతదేహంపై తెరాస జండాను ఎలా కప్పుతారని ఆయన ప్రశ్నించారు. కరోనాతో బాధపడుతున్న సోనియాగాంధీ సైతం అగ్నిపథ్‌ విషయంలో పోరాటం చేస్తున్న యువతకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిపారు. యువత ఎవరు కూడా తొందరపడి బలికావద్దని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చిన అగ్నిపథ్​పై దేశం మొత్తం వ్యతిరేకత వచ్చిందని.. ఈ పరిస్థితుల్లో "సేవ్ ఆర్మీ'' పేరుతో పోరాటం చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. అగ్నిపథ్‌లో 75 శాతం మందిని ఇంటికి పంపిస్తే వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకం భాజపా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉన్నపళంగా రాతపరీక్ష రద్దు చేయడంతో వేలాది మంది నిరుద్యోగులు నిరాశకు లోనై ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో తాజా పరిస్థితులను గమనించైనా అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం రద్దు చేయాలని హస్తం నేతలు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

Army Major Shivakiran: 'ఆర్మీలోని వేరే క్యాడర్‌లో అగ్నిపత్‌ వంటి విధానాలు ఉన్నాయా?'

పక్షి దెబ్బకు విమానంలో మంటలు​.. టేకాఫ్​ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా...

ABOUT THE AUTHOR

...view details