Congress Leaders Satyagraha Deeksha: ప్రధాని మోదీ రాహుల్ గాంధీపై పెద్ద ఎత్తున కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాహుల్‌ని బీజేపీ సర్కార్ వేధిస్తోందని నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తుంటే కమలం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ ఇవాళ గాంధీభవన్‌లో రాజీవ్ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో కాగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మీనాక్షినటరాజన్ సహా రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీకి అండగా నిలుద్దాం: సమాజం మొత్తం రాహుల్‌కు అండగా నిలబడాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వంపై అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని తెలిపారు. రాహుల్‌గాంధీకి దేశవ్యాప్తంగా వస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడుతుందని ఏఐసీసీ కార్యదర్శి, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వ రాజకీయ కక్ష పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. మోదీ వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. మోదీ రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతి గ్రామంలో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచి లాంటిదని... పార్టీ కార్యకర్తలందరూ బలగం సినిమా తరహాలో కలిసికట్టుగా పనిచేయాలన్నారు.