హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by elections)పై కాంగ్రెస్(CONGRESS) నేతలు సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ ఇందిర భవన్‌లో టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీల బలాబలాలు, అభ్యర్థుల ఎంపిక, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్న నాయకులు, వారి బలాబలాలు, పార్టీపరంగా చేయాల్సిన కార్యక్రమాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓటింగ్ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ ముఖ్యనాయకులు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, చిన్నారెడ్డిలతో పాటు హుజురాబాద్ ఎన్నికల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ హస్తవాసి పనిచేస్తుందా?
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న మొదటి ఉప ఎన్నిక కావడం వల్ల... అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతారు? ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, అదొక ప్రక్రియ... ఆ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని తమ కార్యక్రమాలు, కార్యాచరణలు ఉండబోవని రేవంత్ అనడం గమనార్హం. తమ లక్ష్యం అంతా కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలేనని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, స్వయం పాలన, ఆత్మగౌరవం సాధించే దిశగా తమ పోరాటాలు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రత్యేక దృష్టి
హుజూరాబాద్ ఉపఎన్నికల పూర్తి బాధ్యతలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కమిటీకి అప్పగించారు. మండలాల వారిగా ఇంఛార్జీలను నియమించి క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దామోదర రాజనర్సింహ ప్రత్యేక దృష్టి పెట్టారు. మారిన రాజకీయ సమీకరణాలతో అక్కడ గతం కంటే మంచి ఫలితాలు రాకపోయినా... అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకునైనా నిలబెట్టుకుంటే చాలన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:Huzurabad By Elections: కాంగ్రెస్‌కు ఉపఎన్నిక గండం.. ఈసారి రేవంత్ హస్తవాసి పనిచేసేనా?