Rahul meet war in OU: రాష్ట్రంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మే 6న ఓరుగల్లులో రైతు సంఘర్షణ సభలో పాల్గొని తర్వాతి రోజు హైదరాబాద్ ఓయూలో విద్యార్థులతో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు ప్రణాళిక రూపొందించారు. అయితే ఉస్మానియా వర్సిటీలో పర్యటనకు వీసీ అనుమతిని ఇవ్వకపోవడంపై నేతలు మండిపడుతున్నారు. ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ఛాంబర్ ఎదుట ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడకు ఎన్ఎస్యూఐ విద్యార్థులు చేరుకోగా.. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓయూ ఠాణాకు తరలించారు. మరోవైపు మరికొందరు ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నేతలు బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయం ముట్టడికి యత్నించారు. వారిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓయూలో నిరసన చేపట్టిన ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ సహా 17మందిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
రేవంత్ మండిపాటు: ఓయూలో రాహుల్ గాంధీ పర్యటించకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ వస్తే సీఎం ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి వద్దంటూ తెరాస నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో నిరసనలకు అనుమతించామని గుర్తు చేశారు.
ఉత్తమ్ ఫైర్: దేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 25లక్షల మంది నిరుద్యోగులుగా పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఓయూలో రాహుల్ పర్యటిస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం బయట పడుతుందన్నారు. రాహుల్ పర్యటనలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరు సభ నిర్వహించుకున్నారని.. ఓయూ కేసీఆర్ జాగీర్ కాదన్నారు. రాహుల్ గాంధీ కోసం ఉస్మానియా విద్యార్థులు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు.