Ponnala On CM KCR : హేతుబద్ధత, శాస్త్రీయత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. చుక్కనీరు కూడా కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు రాలేదని... సీఎం అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేసే విషయంలో మసిపూసి మారేడు కాయ చేసినట్టు వ్యవహరించారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేశామనే కారణంతోనే... ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టును జాతికి అంకితం చేయలేదని ఆరోపించారు. వర్షాకాలంలో కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్‌కు చుక్క నీరు రాదని... పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడానికి లక్ష కోట్లు రూపాయిలు ఖర్చు చేయాలా అని ప్రశ్నించారు.
సాంకేతికంగా ఎత్తి పోతల పథకాల రిజర్వాయర్ల కెపాసిటీ తక్కువగా ఉంటుందన్నారు. 50 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను మైదానంలో నిర్మాణం చేయడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే జరిగే నష్టం ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు జరిగిన ప్రయోజనం శూన్యమని, ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీళ్లు సముద్రంపాలయ్యాయని ఆరోపించారు.
'మల్లన్నసాగర్‌ను అంకితమిచ్చింది జాతికి కాదు.. కల్వకుంట్ల కుటుంబానికి'
'మల్లన్న సాగర్ పాదాలు కడుగుతున్నానని చెప్పినంత మాత్రాన పుణ్యం వస్తుందా..? కాళేశ్వరం పేరు చెబితే శాస్త్రీయత పోతుందా..? కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్‌కు నీళ్లొస్తాయా..? వర్షాకాలంలో అయితే ఒక్క చుక్కరాదు. ఫిబ్రవరి నుంచి కాళేశ్వరం వద్ద ఎన్ని నీళ్లు ఉంటాయో చర్చకు వస్తావా..? అక్కడి నుంచి ఎంత నీటిని గరిష్ఠంగా తీసుకురావొచ్చు.. 36లక్షల ఎకరాలకు వర్షాకాలం తర్వాత కాళేశ్వరం నుంచి నీటిని తీసుకొచ్చే అవకాశం ఉందా..? ప్రపంచంలో ఎక్కడైనా మైదాన ప్రాంతాల్లో ఇంతటి రిజర్వాయర్ కెపాసిటీ ఉందా..? ప్రమాదం జరిగి నీళ్లొచ్చేస్తే లక్షలాదిమంది కొట్టుకుపోతారనే సంగతి అర్థంకాదా..? సాంకేతిక వివరాలు చర్చించలేవా..? 50 టీఎంసీలకు 10టీఎంసీలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ నీళ్లు ఎక్కడివి..? ఎస్సారెస్పీ నుంచి గోదావరి నుంచి ఎల్లంపల్లికి వచ్చాయి. ఇవాళ 10టీఎంసీలు ఉన్నా.. 50 టీఎంసీలు ఉన్నా... ఆ నీళ్లు ఎల్లంపల్లివి. అవి కాళేశ్వరం నీళ్లు కానేకాదు... ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.' -పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి
ఇదీ చూడండి : గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం.. మాట నిలబెట్టుకున్న సీఎం