తెలంగాణ

telangana

ETV Bharat / state

TPCC: రేవంత్​ నియామకంపై హస్తం పార్టీలో అసమ్మతి సెగలు - telangana varthalu

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌ రెడ్డి నియామకంపై కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి సెగలు చెలరేగుతున్నాయి. మొదటి నుంచి రేవంత్‌ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించొద్దంటూ వ్యతిరేకిస్తూ వస్తున్న నాయకులు రగిలిపోతున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు బాహాటంగానే విమర్శలు చేస్తుండగా... మరి కొందరు నాయకులు పదవులకు, పార్టీకి రాజీనామా చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్​ నియామకంపై హస్తం పార్టీలో అసమ్మతి సెగలు
రేవంత్​ నియామకంపై హస్తం పార్టీలో అసమ్మతి సెగలు

By

Published : Jun 28, 2021, 3:07 AM IST

Updated : Jun 28, 2021, 5:59 AM IST

రేవంత్​ నియామకంపై హస్తం పార్టీలో అసమ్మతి సెగలు

పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించడంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి బహిర్గతమవుతోంది. ఒక్కొక్కరు బయట పడుతున్నారు. బాహాటంగా విమర్శలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కొందరైతే పార్టీ పదవులకు రాజీనామా చేస్తుండగా మరికొందరు పార్టీకి కూడా రాజీనామాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నాయకుల ఏకాభిప్రాయంతో జరగాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించి ఆ దిశలో కసరత్తు చేసింది. డజన్‌కు పైగా నాయకులు పీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడిగా...రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ సీనియర్‌ నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు 150కిపైగా మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. పూర్తి వివరాలతో అధిష్ఠానానికి నివేదించిన తరువాత...అది మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా ఉందని భావించిన కొందరు సీనియర్‌ నేతలు అధిష్ఠానానికి లేఖలు సంధించారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైతే పార్టీ నుంచి పలువురు నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారని, పార్టీలో అనిశ్చిత ఏర్పడుతుందని తదితర అంశాలను కూడా పొందుపరిచడంతోపాటు పార్టీ విధేయులకే ఆ పదవి కట్టబెట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఆచితూచి వ్యవహరించిన అధిష్ఠానం

నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందే పీసీసీ ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా...అప్పట్లో మాజీ మంత్రి జానారెడ్డి ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రకటన ఆపాలని లేఖ రాయడంతో ఆగింది. ఉప ఎన్నిక తరువాత తిరిగి కసరత్తు మొదలైనప్పటికీ...పార్టీ విధేయుల ఫోరం పేరుతో కొన్ని లేఖలు, రేవంత్‌ వ్యతిరేక వర్గీయులు కొందరు లేఖలు రాయడంతో పీసీసీ అధ్యక్షుని ఎంపిక, కార్యవర్గం కూర్పుపై కసరత్తు విషయంలో అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. మరొకసారి సీనియర్‌ నాయకులతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌లు అభిప్రాయాలు తీసుకున్నారు. పీసీసీ పదవి కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డిల మధ్యనే గట్టి పోటీ నెలకొంది. పార్టీ విధేయుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కూడా కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు లేఖలు రాశారు. వి.హనుమంతరావు లాంటి సీనియర్‌ నేతలు కొందరైతే బాహాటంగానే రేవంత్‌ రెడ్డిని వ్యతిరేకించి లేఖలు రాశారు.

కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

పార్టీలో పలువురు నాయకులు వ్యతిరేకిస్తున్నా వాటన్నింటిని పక్కకు నెట్టి చివరకు ఎంపీ రేవంత్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం ప్రకటించింది. మొదటి నుంచి తనకే పీసీసీ పదవి వస్తుందన్న విశ్వాసంతో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఎయిర్‌ పోర్టులో దిగగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అధిష్ఠానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని.. డీఎంకే పొత్తులో నాలుగు టికెట్లు అమ్ముకున్నట్లే ఇక్కడ పదవిని కూడా అమ్ముకున్నారని బాహాటంగానే విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి ఓటుకు నోటులా మారినట్లు తాను దిల్లీకి వెళ్లిన తరువాతనే తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు కార్యకర్తలు, కాలమే నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించిన ఆయన తనను కలిసేందుకు నూతన పీసీసీ అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. తనను కలవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మారిపోతుందని ఆరోపించారు.

అసంతృప్తుల వెల్లువ

మరొకవైపు మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏఐసీసీ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి కూడా కమిటీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆ మేరకు లేఖను సోనియా, రాహుల్‌ గాంధీలకు పంపించారు. తాను కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేసిన ఆయన కొత్తగా నియమితులైన పీసీసీ అధ్యక్షుడు ఈ కమిటీని పునర్నియామకానికి వీలుగా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మొదటి నుంచి వివాదస్పదంగానే కొనసాగుతున్నప్పటికీ... ఏకాభిప్రాయ సాధనతో అసంతృప్తులు చెలరేగకుండా చేయాలని అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని చెప్పొచ్చు. నియామకం జరిగిన 24 గంటల్లోనే ముగ్గురు నాయకులు తమ నిరసనను వ్యక్తం చేయడంతో మరింత మంది అసంతృప్తులు బయట పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, జగ్గారెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్​ అలీలు కూడా ఖండించారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదని.. ఆవేదన ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానానికి ఫిర్యాదు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు చెందిన వీడియోను ఆంగ్లంలోకి అనువాదం చేసి అధిష్ఠానానికి పలువురు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవికి ఫోన్‌ చేసి ఈ విషయంపై ఆరా తీశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: REVANTH REDDY: 'తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉంది'

Last Updated : Jun 28, 2021, 5:59 AM IST

ABOUT THE AUTHOR

...view details