సంగీత స్వర పుత్రుడు, ఉత్తమ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం భారతీయ సంగీత రంగానికి తీరని లోటని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం మృతిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రిశశిధర్ రెడ్డి, హనుమంతరావు, గూడూరు నారాయణ రెడ్డి, నిరంజన్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర...
ఎస్పీ బాల సుబ్రమణ్యం పలు భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన కంఠం నుంచి జాలువారిన మధురమైన పాటలు ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయని పేర్కొన్న ఉత్తమ్... బాలు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా, సు’స్వర’ మధురగీతాల రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్యలోనే ఉంటారని పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.