Congress Leaders on Paddy: వరి రైతులకు మద్దతుగా ఉంటామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. భాజపా, తెరాస నేతలు ప్రాథమిక బాధ్యతను విస్మరించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. వరి సేద్యంపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం (Congress Leaders Pressmeet )లో మాట్లాడారు.
వ్యవసాయశాఖ మంత్రి వరి వద్దని, పామాయిల్ వేసుకోవాలంటున్నారని ఉత్తమ్ ఆక్షేపించారు. యాసంగిలో దీర్ఘకాలిక పంట అయిన పామాయిల్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఖరీఫ్ పంట ధాన్యం గురించి మాట్లాడకుండా రబీ పంట విషయం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేసే అవకాశం ఉన్నా.. ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఆ భూములను రైతులు ఏం చేయాలి?
రోజుల కొద్దీ వరి ధాన్యం కల్లాల్లో ఉండటంతో రైతులు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వరి తప్ప మరో పంట పండని భూములను రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. కేంద్రంపై యుద్ధం చేసే ముందు వర్షాకాల వడ్లు కొనుగోలు చేయాలని సీఎంనుద్దేశించి అన్నారు. కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించి చాలా సార్లు యూ టర్న్‌తీసుకున్నారని ఎద్దేవా చేశారు. భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలుచేయడంలో ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదని భట్టి హెచ్చరించారు.
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురిచేస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. గన్నీ బ్యాగులు ఎన్ని అవసరమో ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా లేవన్నారు. ధాన్యం తరలించే ట్రాన్స్‌పోర్ట్ టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆక్షేపించారు. షరతులు లేకుండా పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:Farmer died of Heart attack Yellareddy : కల్లాల్లోనే కుప్పకూలుతున్న కర్షకులు