Congress leaders on Rosaiah dead: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత క్రమశిక్షణ, సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కాంగ్రెస్ కార్యకర్త రోశయ్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నూటికినూరు శాతం నమ్మి చివరి క్షణం వరకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కృషి చేసిన వ్యక్తి రోశయ్య అని తెలిపారు. ఆయన మృతి తెలుగు రాజకీయల్లో తీరనిలోటని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి... ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగా వెలుగొందారు..
రాష్ట్ర విభజన జరిగినా తన అంతిమ యాత్ర హైదరాబాద్‌లోనే జరుగుతుందని రోశయ్య చెప్పారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య లేని మంత్రివర్గం ఊహించలేదని తెలిపారు. వైఎస్ హయాంలో ఎన్ని పథకాలు అమలు చేసినా ఓవర్ డ్రాప్‌కు వెళ్లలేదని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన జీవన్ రెడ్డి...ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.
అధికారగర్వం లేని వ్యక్తి...
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం, గవర్నర్ లాంటి ఎన్నో పదవులు చేపట్టిన రోశయ్య గర్వంలేని వ్యక్తిగా గుర్తింపుపొందరాని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. అసెంబ్లీలో ఎంతో హుందాతనంతో వ్యవహరించే వారని అన్నారు. అసెంబ్లీలో అర్ధవంతంగా మాట్లాడేవారని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... కౌన్సిల్లో రోశయ్య నిత్యవసర ధరలపై మాట్లాడగా... రోశయ్యను ఎదుర్కోవడం చాలా కష్టమని మండలినే రద్దు చేసే ఆలోచన ఎన్టీఆర్‌కు వచ్చిందని మల్లురవి అన్నారు. రోశయ్య మరణం తీరనిలోటని అన్నారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన ఆయన... రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు.
తెలుగు ప్రజలకు తీరనిలోటు..
రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించారని తెలిపారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం లాంటి ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. రోశయ్య భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు.