కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికలను సురక్షితమైన విధానంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. కమిషనర్‌ను పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, కన్వీనర్ జి.నిరంజన్‌లు కలిసి వినతి పత్రం అందచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు ఉపయోగించాలా... ఈవీఎంలు వాడాలా అని అభిప్రాయం కోరుతూ.. రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ లేఖలు రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మర్రిశశిధర్ రెడ్డి చెప్పారు.
నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి..
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఐసీఎంఆర్ నిబంధనలతో పాటు నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని, బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధానాన్ని అనుసరిస్తుందో తెలుసుకుని సురక్షితమైన విధానాన్ని అనుసరించాలని మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోకుండానే జీహెచ్‌ఎంసీ అధికారులు బ్యాలెట్ పెట్టెలు సిద్ధం చేయడం, సమీకరణ చేయడం, ముద్రణకు రంగం సిద్ధం చేస్తూ ప్రత్యేక అధికారులను నియమించడంపై తీవ్రంగా ఆక్షేపించినట్లు మర్రి తెలిపారు.