వరద సాయాన్ని తెరాస తన ఓటు బ్యాంకుగా మలుచుకుంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ విమర్శించారు. కేసీఆర్‌కు ఫాంహౌస్‌లో చెట్లపై ఉన్న ప్రేమ... వరదల్లో ఉన్న ప్రజలపై, పంట మునిగిన రైతులపై లేదన్నారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ప్రతినిధుల బృందం సరిగా వ్యవహారించలేదని విమర్శించారు. ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిశీలించడానికి రెండు రోజుల సమయం సరిపోతుందా అని ప్రశ్నించారు. వరద బాధితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించారని మండిపడ్డారు.
మళ్లీ రావాలి
ఏరియల్ సర్వే చేసే సమయం సీఎం కేసీఆర్‌కు లేదా అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న దోపిడీపై కేంద్రబృందానికి లేఖ రాసినట్లు శ్రావణ్ తెలిపారు. మరో రెండు సార్లు పరిశీలనకు కేంద్ర బృందం రావాలని కోరుతామన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి రూ.50వేలు, రైతులకు రూ.20వేల చొప్పున పంట నష్టం సహాయం చేయాలని డిమాండ్ చేశారు.