Congress Leaders Comments on Budget Sessions: ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా సీఎం కేసీఆర్.. మోదీ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వైఫల్యం చెందిందని విమర్శించడం బాధాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాజీ ప్రధాని పండిట్ జవహార్‌లాల్ నెహ్రూ వేసిన పునాదులే ఈ దేశాన్ని అభివృద్ది చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్ ఎక్కడ విఫలమయిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గరిబీ హాఠావో, గ్రీన్ రెవల్యుషన్, భూ సంస్కరణలు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి విఫలమయిందా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇన్ని తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం దేశంలో మొదటి సారి అని అభివర్ణించారు.
సమస్యలపై చర్చించడానికి పనిదినాలు పెంచుతారని భావించామని.. కానీ శాసనసభపై బీఆర్ఎస్‌కు ఏమాత్రం గౌరవం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఈ రోజు చర్చ తెలంగాణ బడ్జెట్‌పై జరిగిందా.. లేకుంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జరిగిందా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రంపై నెపం నెట్టారని ఆరోపించారు.
ఎస్టీ, ఎస్సీ నిదులను క్యారీ ఫార్వార్డ్ పేరుతో దారి మళ్లిస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గత సంవత్సరం దళితబంధుకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా.. ఈ సారి అదే బడ్జెట్‌ను పెట్టారని విమర్శించారు. సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం చేసే సహాయం ఏమైందని ప్రశ్నించారు. గిరిజన బంధు కూడా మాయమైపోయిందని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులలో సగం నిధులు కూడా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.