హుజూరాబాద్ గెలుపు ఈటల రాజేందర్‌దేనని, భాజపాది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్, ఈటల మధ్య వ్యక్తిగత గొడవే ఈ ఎన్నికకు కారణమన్నారు. కేటీఆర్ సీఎం పీఠంపై వారిద్దరి మధ్య తగాదా మొదలైందని ఆరోపించారు. కమీషన్లు, భూముల కోసం ఈటల, కేసీఆర్ మధ్య జరిగిన గొడవే ఎన్నికకు ప్రధాన కారణమని షబ్బీర్ అలీ తెలిపారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ రూ.600కోట్లు, ఈటల రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగిందని ఆరోపించారు.
ఫలితంపై రివ్యూ కమిటీ వేస్తాం
హుజూరాబాద్ ఫలితంపై రివ్యూ కమిటీ వేస్తామని షబ్బీర్ అలీ తెలిపారు. ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండలాల వారీగా కాంగ్రెస్ భేటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 14 నుంచి 21 వరకు కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్ర చేపడుతామని పేర్కొన్నారు. రైతుల సమస్యలు, పోడు భూముల సమస్యలు, పెట్రో ధరలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై పీఏసీ అభిప్రాయాన్ని సేకరించినట్లు తెలిపారు.
అక్రమార్జనను కాపాడుకునే ఎన్నిక:మధుయాష్కీ
హుజూరాబాద్ ఉపఎన్నిక ఈటల రాజేందర్ అక్రమార్జనను కాపాడుకునే ఎన్నికని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ విమర్శించారు. ఈ ఎన్నిక ఇద్దరు పెట్టుబడిదారుల మధ్య జరిగిందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో పోటీ చేసిన తమ అభ్యర్థి వెంకట్‌ను అభినందిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి రూ.3 లక్షల కోట్లకు పైగా దండుకుంటున్నారని మధుయాష్కీ ఆరోపించారు. రబ్బరు చెప్పులతో తిరిగే తెరాస నేతలకు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక ఫలితంతో తాము కుంగిపోవడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మాట్లాడొద్దని మాణికం ఠాకూర్ ఆదేశించినట్లు తెలిపారు.
ఎంతపెద్ద నాయకుడైనా పార్టీ విషయాలు పీఏసీలోనే మాట్లాడాలని ఠాకూర్ సూచించినట్లు మధుయాష్కీ వెల్లడించారు. ప్రాంతీయ పార్టీలు భాజపాకు మద్దతుగా వ్యవహరిస్తున్నాయని ప్రియాంక గాంధీ చెప్పారని తెలిపారు. గాడ్సేను ఆదరించే భాజపాతో ప్రాణం పోయినా కాంగ్రెస్ ఎప్పుటికీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. తమ కుటుంబ లబ్ధి కోసం కాంగ్రెస్‌పై కల్వకుంట్ల కుటుంబం ఆరోపణలు చేస్తున్నారని మధుయాష్కీ విమర్శించారు.
ఇదీ చూడండి: