Telangana Congress leaders besieged Raj Bhavan Today: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా.. అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ షేర్ల కుంభకోణం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రారంభించారు. భట్టి విక్రమార్కతో పాటు పార్టీ నేతలు హనుమంతరావు, రోహిత్ చౌదరీ, చెన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవితో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొని, ర్యాలీగా వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాజ్‌భవన్‌కు బయలుదేరారు. వెంటనే అదానీ అంశంలో విచారణ జరిపించాలనే నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ కూడలి వద్దకు రాగానే కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పలువురు కార్యకర్తలు రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. వారిని వెంబడించిన పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ముందుగానే రాజ్‌భవన్‌కు వెళ్లే 2 మార్గాలను పోలీసులు మూసివేశారు.
రాజ్‌భవన్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి.. ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగటంతో.. స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దేశ సంపద ప్రజలకు చెందేలా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేసిందని సీఎల్పీ నేత భట్టి తెలిపారు. అదానీ లాంటి బడావ్యాపారవేత్తలకు దేశసంపదను మోదీ దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే అదానీ అంశంలో విచారణ జరిపించాలని కోరారు. లేకపోతే ఈ ముట్టడిని రానున్న రోజుల్లో ఉద్రిక్తం చేస్తామని ధ్వజమెత్తారు.