రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులలో కరోనా మూలంగా సంభవిస్తున్న మరణాల సంఖ్యకు, మీడియాకు విడుదలవుతున్న హెల్త్ బులెటిన్ సంఖ్యకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని.. ప్రభుత్వం చెప్పే కరోనా లెక్కల్లో చాలా అనుమానాలు ఉన్నాయని మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మరణాలు చాలావరకు అధికారికంగా నమోదు కావడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితుల్లో ఉన్నదానిలో.. పది శాతం మాత్రమే మీడియా బులిటెన్‌లో చూపుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా శ్మశానవాటికల్లో దహనం చేస్తున్న, ఖననం చేస్తున్న సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. ఇతర కారణాలతో మరణాలు సంభవించినప్పుడు ఎందుకు ఆయా కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడం లేదని ప్రశ్నించారు.
‘కరోనా విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాస్తోంది’
కొవిడ్ కేసులు, మరణాలకు సంబంధించి నిజమైన లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కొవిడ్ కేసుల స్థితిగతులపై ప్రజారోగ్య సంచాలకులు సవరించి జారీ చేసిన మీడియా బులెటిన్ లెక్కలను చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసం స్పష్టంగా తెలుస్తుందని ధ్వజమెత్తారు.
మీడియా హెల్త్ బులెటిన్‌లో చూపిన విధంగా ప్రస్తుత మరణాల రేటు కేవలం 2.3 శాతమేనని పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితిని పరిశీలన చేస్తున్న వివిధ కేంద్ర సంస్థలు తెలంగాణ ప్రభుత్వం కేసుల సంఖ్యను తక్కువగా నివేదిస్తున్నట్లు పదేపదే ఆరోపిస్తున్నట్లు వివరించారు. తక్కువ సంఖ్యలో కేసులు, తక్కువ మరణాల రేటు, అధిక రికవరీ రేటును చూపుతున్నట్లు ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలో పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు పది లక్షలకు కనీసం 140 పరీక్షలను చేయాలని చెబుతుండగా తెలంగాణలో కేవలం113 పరీక్షలు మాత్రమే చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. జూన్ రెండో వారం వరకు చాలా తక్కువ పరీక్షలు జరిగాయని, తమ పార్టీ అనేక సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించడం వల్లనే ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి కరోనా ముప్పును తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే వందలాది మంది అమాయక ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు, మరణాల వాస్తవ లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు