rahul gandhi reached hyderabad: శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. హెలికాప్టర్‌లో హనుమకొండకు బయల్దేరనున్నారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు.
రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుందో వివరిస్తామని పీసీసీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తెలంగాణకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో వరంగల్ సభ కూడా అంతే సంతోషాన్ని ఇవ్వబోతుందని వెల్లడించారు. నూతన వ్యవసాయ విధానాన్ని వరంగల్ వేదికగా ఆవిష్కరించబోతున్నామన్నారు. రాహుల్ గాంధీకి ఓయూలోకి అనుమతి ఇవ్వకుండా కొందరు ఆనందం పొందుతున్నారని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసం తపిస్తే అధికారం కోల్పోవడం ఖాయమన్నారు.
''జైళ్లో ఉన్న వారిని కలుసుకోవడం విధానపరమైన నిర్ణయం. చచ్చేముందు తెరాస నాయకులు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో 70 శాతం రైతులకు సంబంధించింది వరంగల్ సభ. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిగా ఈ సభను ఏర్పాటు చేశాం. రైతుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం. ఉక్కు సంకల్పంతో ఇచ్చిన రాష్ట్రం.. కోతుల గుంపులో చిక్కుకుంది.'' - రేవంత్‌రెడ్డి
''తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది కాంగ్రెస్. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏ పౌరుడైనా వెళ్లొచ్చు. రాహుల్‌గాంధీని అడ్డుకోవటం సమంజసం కాదు. రాహుల్‌గాంధీకి దేశమంతా తిరిగే హక్కుంది. విక్రమార్క ఒక ఎంపీ వర్సిటీలోకి వెళ్లొద్దని అంటున్నారంటే అర్థమేంటి?. వర్సిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని అర్థం. రాహుల్‌గాంధీని ఓయూకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం.'' - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత