తెరాస ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లీనరీకి సంబంధించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, జెండాలకు అనుమతి ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించారు. తెరాస ఫ్లెక్సీలకు అనుమతి ఉన్నట్లయితే ఎంత మొత్తం వసూలు చేశారో తెలియచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు.
ఫ్లెక్సీలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసి ఉంటే ఎంత పెనాల్టీ విధించారో కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. చట్టాలు, నిబంధనలు అందరికీ సమానం కాదా అని నిలదీశారు. నగరంలో ఇటీవల"టు లెట్" బోర్డ్ పెట్టారని జరిమానా విధిస్తూ నోటీసు ఇచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్మెంట్ విభాగం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తెరాస విషయంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్న జీహెచ్‌ఎంసీ గతంలో వసూలు చేసిన జరిమానాల సొమ్మును తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు.