Jaggareddy Comments: ప్రధాన మంత్రి హోదాలో తెలంగాణ వచ్చిన మోదీ.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరికాదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని ఎదుట రాష్ట్ర సమస్యలను తెరపైకి తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఊర్లో లేకుండాపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పీఎంతో పాటు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొని ఆ రాష్ట్ర ప్రజల గొంతుక వినిపించారని కొనియాడారు. అదే తెలంగాణకు చెందిన సమస్యలను ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎప్పుడైనా గుడికి పోయారా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. బండి సంజయ్ చేసిన వాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. బండి సంజయ్ ముస్లింలను వేరు చేస్తూ....హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానిని నిలదిసే దమ్ము లేని బండి సంజయ్.. మసీదులను తవ్వుతాననడం రెచ్చగొట్టడమే అవుతుందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ అలా కాదు.. హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకుంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ మోదీని, మోదీని కేసీఆర్ తిడితే.. ప్రజల కడుపు నిండుతుందా అని నిలదీశారు. కేసీఆర్, మోదీల ఒప్పందం టూర్‌లా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బెంగళూరు, మోదీ హైదరాబాద్ టూర్ లోపాయకారి ఒప్పందమేనని ఆయన ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్, భాజపాలను కాదని కేసీఆర్ ఏం చేయలేడని, దేశ రాజకీయాల్లో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.