Bhatti Vikramarka press meet: రాష్ట్రంలో పోడు రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. గతంలో అసైన్డ్ కమిటీలు ఉండేవని.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించారని ఆయన అన్నారు. దీంతో భూమి లేని పేద ప్రజలకు భూపంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే పరస్పర దాడులు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈడీ, ఐటీ, జీఎస్టీల పేరుతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కుట్ర పూరితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, మీడియాను, మేదావులను, సామాజిక శాస్త్రవేత్తలను, రాజకీయనాయకులను పక్కదారి పట్టించడం చాలా బాధకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
రొటీన్‌గా జరిగే ఈ దాడులను బీజేపీ, టీఆర్ఎస్లు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులు సభ్యసమాజం తలదించుకునేట్లు పరస్పరం దూషించుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేసే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీని వీడిన మర్రి శశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదని ఆయన ఖండించారు.