Congress Fight against public issues : ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. భారత్ జోడో యాత్ర, మునుగోడు ఎన్నికలు ముగియడం... ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు సిద్ధమైంది. ప్రధానంగా రైతు సమస్యలు, పోడు భూముల వ్యవహారం, ధాన్యం కొనుగోళ్లు, ఓబీసీ, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా తెరాస, భాజపా కూడబలుక్కుని ఏదో ఒక వివాదం తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చుతున్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భూసమస్యలపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి.. ఏపీతో పాటు మరికొన్నిరాష్ట్రాలకు వెళ్లి అక్కడి రెవెన్యూ శాఖలు తీసుకుంటున్న చర్యలు, భూ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, పోడు భూములు, కౌలు రైతులకు సంబంధించి అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేశారు. అక్కడి వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయి.. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయని ఆరా తీశారు.
గీత దాటితే చర్యలే..: 2023 ఎన్నికలకు పార్టీపరంగా సిద్ధం కావాల్సి ఉండడంతో.. ప్రస్తుతం చేపట్టే కార్యక్రమాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపేటట్లు ఉండాలని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి... వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ప్రజాపోరాటానికి కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పీసీసీ నిర్వహిస్తున్న ముఖ్య నాయకుల సమావేశాలకు కొందరు గైర్హాజరవుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించాలని పీసీసీ యోచిస్తోంది. అందులో భాగంగానే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి గీత దాటినట్లు భావించి ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. నేతలు ఎవరైనా గీత దాటితే ఇదే తరహా చర్యలు ఉంటాయని క్రమశిక్షణ సంఘం హెచ్చరిస్తోంది.
కట్టడి చర్యలకు నిర్ణయం..: మరోవైపు పార్టీ సమావేశాలకు హాజరై పీసీసీ తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అధికార ప్రతినిధులు సైతం హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ.. కట్టడి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా 9 మంది అధికార ప్రతినిధులకు కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నోటీసులు పంపించారు. ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని కోరారు. టీవీల్లో చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యత.. పార్టీ కార్యక్రమాలకు అధికార ప్రతినిధులు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉండటంతో కఠినంగా ముందుకు వెళ్లాలని పీసీసీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.