Congress focuses on Telangana assembly elections : శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో కాంగ్రెస్ తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఘర్ వాపసీ, చేరికలతో జోష్ పెరగడంతో ఉత్సాహంగా ఉరక లేస్తోంది. కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తెస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈనెల 23న జరగనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రచార వ్యూహాలు, చేరికలు వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఇటీవల 37 మందితో ప్రచార కమిటీ నియమించిన అధిష్ఠానం తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిఛైర్మన్‌గా 26మందితో కీలకమైన ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఎన్నికల కమిటీలో సామాజిక న్యాయం జరిగిందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇరవత్రి అనిల్ వంటి నాయకులకు కమిటీలో స్థానం దక్కలేదు. తనను కమిటీలోకి తీసుకోకపోవడంపై పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎన్నికల కమిటీలో చోటు దక్కడంపై విమర్శలు వస్తున్నాయి.
కమిటీలో సభ్యుల సంఖ్య కుదించడం వల్లే కొందరికి అవకాశం దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ చేపట్టబోయే కార్యక్రమాల్ని ఎన్నికల కమిటీలో చర్చించి ఆమోదించాల్సి ఉంటుంది. ప్రచార వ్యూహాలు, డిక్లరేషన్ల తయారీ, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై సమాలోచనలు జరుపుతారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, గెలుపు గుర్రాల కోసం నియోజకవర్గాల వారీగా ఆశావహులతో చర్చలు జరపడం వంటి బాధ్యతల్ని ఎన్నికల కమిటీ నిర్వర్తించాల్సి ఉంటుంది.