పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA Jagga Reddy) చేసిన వ్యాఖ్యలపై... ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేట్లు ఉన్నాయన్న అభిప్రాయంతో రాష్ట్ర వ్యవహారాలఇంఛార్జి మాణికం ఠాగూర్ (Manickam Tagore,congress in-charge of state affairs) రంగంలోకి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు (AICC Secretary Bosuraju) ద్వారా ఠాగూర్ పూర్తిసమాచారం తెప్పించుకున్నారు.
అసలు శుక్రవారం జగ్గారెడ్డి ఏమన్నారంటే..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను. నాకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. ఎవరి ఒత్తిడి మేరకు సభాధ్యక్షురాలు గీతారెడ్డి మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏమి జరుగుతుంది? ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు? ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేకుండా పోయింది. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు. చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారే కనుమరుగయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్లి పని చేయాలి. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ మద్ధతు లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తా.