తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​రెడ్డి త్రిముఖ వ్యూహాం... ఎన్నికలే లక్ష్యంగా పావులు - Congress has a three pronged Strategy

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌.... త్రిముఖ వ్యూహానికి పదును పెట్టింది. ఎన్నికలే లక్ష్యంగా  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు.  తెరాస, భాజపాను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తూ... హల్‌చల్‌ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. బరిలోకి దిగేందుకు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ను... వేగం పెంచేదిశలో పావులుకదుపుతున్నారు.

Congress has a three pronged Strategy
రేవంత్​రెడ్డి త్రిముఖ వ్యూహాం... ఎన్నికలే లక్ష్యంగా పావులు

By

Published : Jul 19, 2022, 12:34 PM IST

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.... జోరు పెంచారు. పార్టీ ప్రక్షాళన కోసం.. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, 36 మంది డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు.. జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి నివేదించారు. ఇప్పటికే ఉన్న ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా.. మార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి.. ఎన్నికలకు వెళ్లేట్లు రేవంత్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చేపట్టి.. ఇతర పార్టీల నుంచి పార్టీలోకి చేరికలను రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జాబితాను అధిష్ఠానానికి అందజేసినట్లు సమాచారం. సీనియర్లను కట్టడి చేసుకుంటూ.. పార్టీలో దూకుడు పెంచిన రేవంత్‌రెడ్డి ... అధికార తెరాస, భాజపాలను అయోమయంలోకి నెట్టేందుకు.... 90 లక్షలు ఓట్లు వస్తాయని.. 70 స్థానాల్లో గెలిచి తీరుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌కు 40లక్షలకుపైగా సభ్యత్వాలు ఉండడంతో ఒక్కో సభ్యుడు ఒక్క ఓటు వేసినా.. తాను అనుకున్న సీట్లు వస్తాయన్న ధీమాతో... ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పలు సంస్థలు చేసిన సర్వేల నివేదికల ఆధారంగా కూడా.. రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది.

అధికార తెరాస, భాజపాలపై విమర్శలను తగ్గించి.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమి చేస్తుందో.. స్వయాన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో పీసీసీ ప్రకటించింది. ఇప్పటికే వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించడంతో... పార్టీలో జోష్‌ పెరిగి.. ఏకంగా మూడు శాతం ఓటింగ్‌ పార్టీకి పెరిగినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రైతు డిక్లరేషన్‌ను రైతురచ్చబండ పేరుతో.. జనంలోకి తీసుకెళ్లి పెద్దఎత్తున ప్రచారం కల్పించారు. ఇప్పుడు తాజాగా.. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న విద్యార్థి నిరుద్యోగ సభలో... నిరుద్యోగ యువత డిక్లరేషన్‌ ప్రకటించేందుకు పార్టీ కసరత్తు పూర్తి చేసింది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి.. వరదలు రావడంతో... వచ్చేనెల రెండో తేదీన సభ నిర్వహించడం సరికాదన్న ఆలోచనతో ఉన్న రేవంత్‌రెడ్డి... రాహుల్‌ గాంధీతో చర్చించి వాయిదా వేయించే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఆపరేషన్‌ ఆకర్ష్‌లో.. పార్టీ సీనియర్లు కొందరు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ.. తాను అనుకున్నట్లు ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న చోట్ల బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి నివేదించగా.. దానిపై రాజకీయ వ్యూహకర్త సునీల్‌ నుంచి కూడా ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో గెలిచి తీరాలన్న పట్టుదలతో రేవంత్‌రెడ్డి ఉన్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా 90లక్షల ఓట్లు, 70 సీట్ల నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details