తెలంగాణ

telangana

ETV Bharat / state

'యువతిపై దాడి ఘటనపై కేటీఆర్​ ఎందుకు స్పందించట్లేదు?' - తెరాస కార్పొరేటర్​ యువతిపై దాడి వీడియో వైరల్

శేరిలింగంపల్లిలో యువతిపై దాడికి పాల్పడిన తెరాస కార్పొరేటర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కార్పొరేటర్ నాగేందర్‌ యాదవ్‌ రాంగ్‌ పార్కింగ్​పై అభ్యంతరం చెప్పిన యువతిని నోటికొచ్చినట్లు మాట్లాడడం దేనికి సంకేతమని ప్రశ్నించింది.

congress gudur narayanreddy on trs
'యువతిపై దాడి ఘటనపై కేటీఆర్​ ఎందుకు స్పందించట్లేదు?'

By

Published : Sep 16, 2020, 8:42 PM IST

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే... తెరాస కార్పొరేటర్ దుర్భాషలాడుతూ.. తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టమవుతోందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు.

ప్రజల ముందే అకారణంగా యువతిపై దాడి చేయడం... కార్పొరేటర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదన్న ఆయన దాడిని ఖండించారు. తెరాస నాయకులు సామాన్య ప్రజలపై దాడి చేయడం ఇది మొదటిసారి కాదని, భూ వివాదంలో జులైలో నారపల్లిలో ఒక వ్యక్తి, అతని కుటుంబంపై తెరాస కార్పొరేటర్ అంజలి భర్త శ్రీధర్ గౌడ్, అతని అనుచరులు దాడి చేశారని విమర్శించారు. కొందరు తెరాస నాయకులు బహిరంగంగానే రౌడియిజం చెలరేగిపోతున్నా.. యువతిపై దాడి జరిగినా మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తెరాస పార్టీ నాయకులు కొందరు బహిరంగ రౌడిజానికి పాల్పడుతుంటే.... పార్టీ కార్యానిర్వహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తెరాస కార్పొరేటర్ నాగేందర్ యాదవ్‌పై డీజీపీ మహేందర్‌ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details