Congress Government on Gas Cylinder Scheme : మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్ (Mahalakshmi Gas Cylinder Scheme) పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారినే, ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా, లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది.
Mahalakshmi Gas Cylinder Scheme in Telangana :ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కలెక్టర్లతో నిర్వహించే కాన్ఫరెన్స్‌లో ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రూ.500లకు గ్యాస్ సిలిండర్ కావాలంటే తప్పనిసరి కేవైసీ అంటూ పుకార్లు - క్యూ కట్టిన వినియోగదారులు
500 Rupees Gas Cylinder Scheme in Telangana : రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక పన్నెండు ఇవ్వాలా? అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య, వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. కొత్త కార్డులు పొందే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చెబుతున్నారు. మరోవైపు కొత్త గ్యాస్ కనెక్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం.
85.79 లక్షల కార్డులు :తెలంగాణవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు (Gas Connections in Telangana) ఉన్నాయి. ఇందులో రేషన్‌కార్డుల సంఖ్య 89.98 లక్షలు కాగా, గివ్ ఇట్ అప్‌లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే మరోవైపు రేషన్‌కార్డు డేటాబేస్‌తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది.