Congress Government Move Towards Transparency : తెలంగాణలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాసిందని కాంగ్రెస్‌ఆరోపిస్తూ వచ్చింది. నిరంకుశ పాలనకు విముక్తి లభించిందని పదే పదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను పరిరక్షించేందుకు తాము పాలన సాగిస్తామని స్పష్టం చేస్తూ వస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, సమీక్షలు చూస్తుంటే ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది.
గుడ్ న్యూస్ - కొత్త రేషన్ కార్డుల కోసం 28 నుంచి దరఖాస్తులు!
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం రేవంత్ : గత ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఉంటున్న ఇంటికి ఉన్న ఇనుప కంచెను తొలిగించిన రేవంత్ రెడ్డి దాన్ని ప్రజాభవన్‌గా నామకరణం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani programme) ఏర్పాటు చేశారు. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వానికి పూర్తిగా భిన్నంగా తాజా ముఖ్యమంత్రి పరిపాలనను పరుగెత్తిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం, మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడం పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయడం అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి.
CM Revanth Reddy Hiring Senior Officers :అధికార బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చినందున అందుకు తగ్గట్లు పరిపాలన కొనసాగించేందుకు వీలుగా సీఎం తన జట్టును ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ఇంటిలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించుకున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ కార్యదర్శులుగా శేషాద్రి, చక్రవర్తి, ఐపీఎస్ షెహనవాజ్‌ను నియమించుకున్నారు. ఓఎస్‌డీగా కంటోన్మెంట్‌లో సీఈవోగా పని చేసిన అధికారి అజిత్ రెడ్డిని నియమించుకున్నారు.
Three New Police Commissioner Appointed in Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్ నగరంలో ముగ్గురు పోలీసు కమిషనర్లను కొత్తగా నియమించుకున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే కొత్తకోట శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్ సీపీగా నియమించిన రేవంత్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా మరో నిజాయతీ కలిగిన అధికారి అవినాష్ మహంతిని, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబును నియమించుకున్నారు. ట్రాఫిక్ చీఫ్‌గా విశ్వప్రసాద్‌ను, సిట్ చీఫ్‌గా రంగనాథ్‌లను నియమించుకున్నారు. పోలీసు అధికారుల విషయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి అధికారుల పనితీరుపై విశ్లేషించిన తర్వాతనే సిఫారసు చేస్తున్నట్లు తెలుస్తోంది.