Congress Government Focus on Dharani Portal : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించిన, ధరణి పోర్టల్‌పై (Dharani Portal) రెవెన్యూ శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. 2020 నవంబర్2 నుంచి ప్రారంభమైన ఆ పోర్టల్ ద్వారానే, రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ధరణి వెలుపల ఉన్న భూములకు హక్కులు లేవు. హక్కుల కల్పనకి 34 మ్యాడ్యూళ్లు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదు.
Revenue Department Report on Dharani Portal : ధరణి పోర్టల్‌లోని లోపాలను పరిష్కరించి, అందరీకీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గతనెల 13న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరణిపై అధికారులతో సమీక్షించారు. పోర్టల్‌లో జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారం అందించాలని, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్‌ని సీఎం ఆదేశించారు. రాత్రిపూట జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందించాలని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ధరణి నిర్వహణ, సాంకేతిక అంశాలపై పలు అంశాలపై ప్రభుత్వం ఆరా తీసింది.
పట్టదారు పాసు పుస్తకాలపై మరో అంశం తెరపైకి.. ఇకపై వ్యవసాయేతర భూములకు..!
నివేదిక రూపొందిస్తోన్న రెవెన్యూ శాఖ :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు- మ్యూటేషన్లకు సంబంధించిన వివరాలను, రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. వివాదాస్పద జాబితా (22A)లో నమోదైన భూములను, జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించిన అంశంపైనా వివరాలు కోరడంతో, ఆ దిశగా యంత్రాంగం కసరత్తు కొనసాగిస్తోంది. సీఎం ఆదేశాలతో పలువురు నిపుణులతో సాంకేతిక సమస్యలపై, రెవెన్యూ శాఖ నివేదిక రూపొందిస్తోంది.
ధరణిలో దాదాపు 68 లక్షల వ్యవసాయ ఖాతాలు :ధరణిలో దాదాపు 68 లక్షల వ్యవసాయ ఖాతాలుండగా, ఆ పోర్టల్‌ని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. గత సెప్టెంబర్‌తో నిర్వహణ గడువు ముగియగా అదే సంస్థను కొనసాగిస్తూ వస్తున్నారు. ధరణి పేరు మార్పు నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించడం, సులువుగా ప్రజలకు సేవలు చేరేందుకు ఉన్న మార్గాలను, నిపుణులు నివేదికలో రూపొందిస్తున్నట్లు సమాచారం.