Congress Focus on Telangana Assembly Elections :రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్(TelanganaCongress).. తీవ్రంగా శ్రమిస్తోంది. ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో.. అభ్యర్థులంతా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పార్టీకి సానుకూల వాతావరణం ఉన్నట్లు చెబుతున్న హస్తం పార్టీ.. అధికార బీఆర్‌ఎస్, బీజేపీని ఎదుర్కొనేందుకు మరింత పటిష్ఠంగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఏ చిన్నపాటి అవకాశం కూడా బీఆర్‌ఎస్, బీజేపీకి ఇవ్వరాదన్న భావనతో.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌లో.. నియోజకవర్గాల వారీగా ప్రచారం, బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం, ఆరు గ్యారెంటీలను (Congress Six Guarantees in Telangana) ఇంటింటికి చేరేట్లు చూడడం తదితర అంశాలను పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 20,000ల లెక్కన ఆరు గ్యారెంటీల కార్డులను 119 నియోజకవర్గాలకు పంపిణీ చేసింది.
ప్రచారంలో కాంగ్రెస్ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్ జోష్, డైలమాలో బీజేపీ!
ఈ గ్యారెంటీ కార్డులు బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి చేరుతున్నాయా లేదా అన్నదానిపై కూడా.. వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉండగా.. తెరవెనుక జరగాల్సిన కార్యక్రమాలను చక్కబెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 60కి పైగా నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలకు చెంది శిక్షణ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వార్ రూమ్ యంత్రాంగం పని చేస్తోంది.
Congress Election Campaign in Telangana : ఇప్పటి వరకు దాదాపు డజన్ ఏఐసీసీ ప్రత్యేక బృందాలు.. గడిచిన నాలుగైదు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించాయి. పార్టీ అభ్యర్థిని కలవడంతో పాటు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో సమీక్షలు జరిపినట్లు సమాచారం. తద్వారా ఇప్పటి వరకు వార్ రూమ్ నుంచి పెట్టిన ప్రత్యేక ప్రయత్నం.. ఏ మేరకు ప్రయోజనకరంగా ఉందనే అంశంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంతకంటే ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఏదైనా ఉందా అన్న దానిపై ముందుకు వెళ్లాలని వార్ రూమ్ ప్రతినిధులు భావిస్తున్నట్లు సమాచారం.