తెలంగాణ

telangana

ETV Bharat / state

టార్గెట్‌ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌ - 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇంఛార్జీల నియామకం

Congress Focus on Parliament Elections 2024 : తెలంగాణలో పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగాలని కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పార్టీ కార్యాచరణ ఉండాలని పీఏసీ తీర్మానించింది. పార్లమెంటు నియోజకవర్గాల ఇంఛార్జులుగా మంత్రులు, సీనియర్‌ నాయకులను నియమించి, పార్టీ బలోపేతం కోసం ముందుకు వెళుతోంది. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయడం ద్వారా ఓటర్లలో విశ్వాసాన్ని నింపి తద్వారా ఓటర్లను కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలని నిర్ణయించింది. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పీఏసీ, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను ముందే ప్రకటించాలని నిర్ణయించింది.

Parliament Elections 2024
Congress Focus on Parliament Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 7:22 PM IST

Congress Focus on Parliament Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చామన్న భావనతో నిర్లక్ష్యం చేయరాదని తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ తేల్చి చెప్పింది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, ఎదుటి పార్టీలకు దీటుగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఐదు అంశాల ఎజెండాతో గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, పీఏసీ ఛైర్మన్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యక్షతన సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలు, ఆరు గ్యారంటీలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది.

అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ఏఐసీసీ నాయకులకు పీఏసీ ధన్యవాదాలు తెలిపింది. ఆరు గ్యారంటీల అమలుపై చర్చించిన పీఏసీ, లోక్‌సభ ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చించింది. సోనియాగాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఏకగ్రీవంగా పీఏసీ తీర్మానం చేసింది. సోనియాగాంధీ పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన తరువాత నియోజకవర్గాన్ని ఎంపిక చేయాలని యోచిస్తోంది. నాగ్‌పూర్‌లో ఈ నెల 28వ తేదీన 131వ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి తెలంగాణ నుంచి యాభై వేల మంది వరకు హాజరయ్యేట్లు చూడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జన సమీకరణ బాధ్యత పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు అప్పగించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి - పీఏసీ ఏకగ్రీవ తీర్మానం

నామినేటెడ్‌ పోస్టులను నెలలోపు భర్తీ చేయాలని నిర్ణయించిన పీఏసీ, ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన నాయకులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, హామీ ఇచ్చిన నాయకుల జాబితా సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇంఛార్జీలకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. వీలైనంత మేరకు హామీలు ఇచ్చిన వారికి నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చి మాట నిలబెట్టుకోవాల్సి ఉందని రేవంత్‌ రెడ్డి పీఏసీలో గుర్తు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు పోటీ చేసి ఓడిన నాయకులే ఇంఛార్జీలుగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ నిర్ణయించింది. పార్లమెంటు వారీగా మంత్రులు, సీనియర్‌ నాయకులను ఇంఛార్జ్​లుగా నియమించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్​లుగా మంత్రులను, సీనియర్‌ నేతలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలకు మాత్రమే రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంఛార్జ్​లుగా నియమించగా, మిగిలిన వాటికి ఒక్కొక్కరికి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు.

టార్గెట్​ 2024- ఈ నెల 21న CWC భేటీ- బీజేపీని ఓడించే వ్యూహాలపై చర్చ

ఆ వివరాలను పరిశీలిస్తే

  • ఆదిలాబాద్‌: సీతక్క
  • పెద్దపల్లి: శ్రీధర్‌ బాబు
  • కరీంనగర్‌ : పొన్నం ప్రభాకర్‌
  • నిజామాబాద్‌ : జీవన్‌ రెడ్డి
  • జహీరాబాద్‌: పి.సుదర్శన్‌ రెడ్డి
  • మెదక్‌: దామోదర్‌ రాజనర్సింహ
  • మల్కాజిగిరి: తుమ్మల నాగేశ్వరరావు
  • సికింద్రాబాద్‌: భట్టి విక్రమార్క
  • హైదరాబాద్‌: భట్టి విక్రమార్క
  • చేవెళ్ల: రేవంత్‌ రెడ్డి
  • మహబూబ్‌నగర్‌: రేవంత్‌ రెడ్డి
  • నాగర్‌కర్నూల్‌: జూపల్లి కృష్ణారావు
  • నల్గొండ: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
  • భువనగిరి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • వరంగల్‌: కొండా సురేఖ
  • మహబూబాబాద్‌: పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
  • ఖమ్మం: పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు మొదట ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ప్రకటన చేయాలని నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల ద్వారా జరగాల్సి ఉందని పీఏసీ అభిప్రాయపడింది. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తీర్మానించింది. అయితే క్షేత్రస్థాయిలో గ్రామ సభల ద్వారా ఆరు గ్యారంటీలకు అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టేందుకు విధి విధానాలు రూపకల్పన చేయాలని నిర్ణయించింది. ఆ విధి విధానాల ఆధారంగానే గ్రామ సభల ద్వారా అధికారులు ఆరు గ్యారంటీలకు అర్హులుగా ఎంపిక చేస్తారు.

కాంగ్రెస్‌ 'విరాళాల' బాట- లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధం- పార్టీ ఆవిర్భావం రోజునే!

అలా చేయడం ద్వారా నకిలీలకు అవకాశం లేకుండా ఉండడంతో పాటు పారదర్శకతకు పెద్ద పీఠ వేసినట్లు అవుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రధానంగా నకిలీ రేషన్‌ కార్డుల తొలగింపు, అర్హులైన వారికి రేషన్‌ కార్డుల జారీ, బీపీఎల్‌ కుటుంబాల గుర్తింపు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పొందేందుకు అర్హుల జాబితా, ప్రతి నెలా రూ.2500 తీసుకునేందుకు అర్హులైన మహిళల జాబితాతో పాటు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా లబ్ధికి అర్హులైన వారి జాబితా సిద్ధం చేయడం లాంటివి అన్నీ కూడా గ్రామ సభల ద్వారా నిర్ణయించడం వల్ల పారదర్శకతకు పెద్ద పీఠ వేసినట్లవుతుందని పీఏసీ భావిస్తోంది.

నీటి పారుదల శాఖలో భారీ ఎత్తున నిధులు ఖర్చు కావడం, సరైన రికార్డులు లేని విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీఏసీకి వివరించారు. ఈ విషయంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకుని ప్రిన్సిపల్‌ సెక్రటరీల ద్వారా బయటకు వెల్లడించేట్లు చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. విద్యుత్, ఇరిగేషన్, ఫైనాన్స్ శాఖలపై సమగ్ర సమాచారంతో వరుసగా మూడు రోజుల పాటు శ్వేత పత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బెల్ట్‌ షాపులను తొలగించడం ద్వారా ఎక్సైజ్‌ శాఖకు వచ్చే ఆదాయంపై ఆ ప్రభావం ఉంటుందని కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

మరో కొత్త నినాదంతో ఇండియా కూటమి- నాలుగో సమావేశం అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details