Congress Focus on Nominated Posts : తెలంగాణలో పదేళ్లపాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్‌ను ఎదురొడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం తీవ్రంగా శ్రమించాయి. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి( Revanth Reddy), మిగిలిన కీలక నేతలు పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో పని చేశారు. అధికార పార్టీని ఎదుర్కొని హస్తం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడంతోనే సాధ్యమైందన్న భావన రాష్ట్ర నాయకత్వానికి ఉంది.
ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం ప్రత్యేక దృష్టి :ఈ నెల 7న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో, ఆరు గ్యారెంటీలను (Congress Six Guarantees) అమలు చేస్తామని ఇచ్చిన హామీలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చారు.
తొమ్మిదిన్నరేళ్ల అస్తవ్యస్త పాలనను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం : మంత్రి జూపల్లి
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)సమీక్షలు చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, సాధారణ పరిపాలనకు అవసరమైన నిధులను, మినహాయించి అందుబాటులో ఉన్న నిధులను మిగిలిన గ్యారెంటీలను అమలు చేసేందుకు ఉపయోగించేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
నామినేటేడ్ సీట్ల కోసం నాయకుల జాబితా చాంతాడంత :మరోవైపు ఆర్థిక వెసులుబాటు ఆధారంగా రైతుబంధు అమలు, మిగిలిన గ్యారెంటీలను అమలు చేసేందుకు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు, పార్టీ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల సీట్ల కోసం నాయకుల జాబితా చాంతాడంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నేతలతో పాటు, టికెట్లు త్యాగం చేసిన నాయకులు కూడా పదవులను ఆశిస్తున్నారు.