Congress Election Campaign in Telangana 2023 : రాజకీయంగా నష్టపోయినా.. తెలంగాణ ఇచ్చామంటున్న కాంగ్రెస్.. రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూసింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు, వ్యూహాల్లో పొరపాట్లను సరిదిద్దుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి బలంగా బరిలోకి దూసుకొచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలనే కసితో.. నాయకులంతా అభిప్రాయబేధాలు పక్కనపెట్టి సమష్టిగా పోరాడుతున్నారు.
Telangana Congress Elections planning 2023 : ఇటీవల వచ్చిన కొన్ని సర్వేల్లో అధికారం హస్తానికే దక్కుతుందనే అంచనాలు.. కాంగ్రెస్‌లో జోష్ నింపాయి. కర్ణాటకలో కాషాయదళం ఓటమి సహా బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నాయకులు చెయ్యి పార్టీ వైపు చూశారు. బీఆర్ఎస్లో టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలు, తటస్థులూ.. కాంగ్రెస్ గూటికే చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కలిసి వచ్చింది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సహా మాజీ ఎమ్మెల్సీలు, కీలక నాయకుల చేరికతో.. కాంగ్రెస్ నూతనోత్సాహం ఉరకలెత్తింది. కేసీఆర్‌ని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ఆయన కుమారుడు వంశీ కాంగ్రెస్‌లో చేరారు. కొత్త నేతలతో పాటు పార్టీని వీడిన వాళ్లూ తిరిగి రావడంతో.. కాంగ్రెస్ బలంగా ఎన్నికల రణక్షేత్రంలో నిలబడింది.
Telangana Election Campaign 2023 : బీఆర్ఎస్ను బలంగా ఢీకొట్టేందుకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తే చేసింది. టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. వెయ్యికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను వడబోసిన ప్రదేశ్ఎన్నికల కమిటీ.. మురళీదరన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి 300 మంది పేర్లను సూచించింది. గెలుపు అవకాశాలు, పార్టీ విధేయత, సర్వేలు ప్రాతిపదికగా సుదీర్ఘ వడపోతల అనంతరం.. అక్టోబరు 15న.. 55 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. సిట్టింగ్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు ఉండడంతో.. మొదటి జాబితాపై.. పెద్దగా అసమ్మతి బయట పడలేదు. ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, నియోజకవర్గాలల్లో అసమ్మతి చెలరేగింది. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. కొందరు నాయకుల్ని.. రాష్ట్ర నాయకత్వం బజ్జగించింది.