హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత దిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్... ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ తప్పుకుంటున్నట్లు తెలియడం వల్ల ఆ పదవి కోసం పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. వర్గాల వారీగా తమకంటే తమకు కావాలని...సీనియర్ నేతలు ముందుకు వస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఏఐసీసీ దృష్టి సారించింది. ఏపీలో ఇప్పటికే పీసీసీ అధ్యక్ష ఎంపిక నిమిత్తం ఆ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఉమెన్ చాందీ నేతృత్వంలో సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
పీసీసీ రేసులో డజను మంది
తెలంగాణలో కొత్త పీసీసీ ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. ఇందుకోసం...అభిప్రాయ సేకరణ చేసేందుకు అధిష్ఠానం ఓ ప్రతినిధిని త్వరలో రాష్ట్రానికి పంపనున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ బెంగళూరులో వ్యక్తిగత పనిపై ఉండడం వల్ల అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొంత ఆలస్యంగా కొనసాగనుంది. దాదాపు డజను మంది పీసీసీ రేసులో ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే... రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరుకుంటున్నారు.
తాజా రాజకీయ పరిస్థితులే ప్రామాణికం