రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన ప్రదర్శన (Congress Dharna on Paddy Procurement) నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు.
సాగుచట్టాలు, ధాన్యం కొనుగోలు విషయంలో అధికార పార్టీలు ధర్నా చేయడమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు... చట్టపరంగా చేయాల్సిన పనులెందుకు చేయట్లేదని నిలదీస్తున్నారు. సీఎం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసే ముందు అసెంబ్లీ సమావేశాలు పెట్టి సాగుచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయి. కేంద్రం కొనట్లేదని రాష్ట్రం, రాష్ట్రం కొనట్లేదని కేంద్రం సాకులు చెప్తున్నాయి. 1947 నుంచి రాని సమస్య ఇప్పుడెందుకొస్తోంది? గత ప్రభుత్వాలకు రాని సమస్యలు భాజపా, తెరాసకు మాత్రమే వస్తున్నాయి. రైతుల పంటలు కొనాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. అంతిమంగా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి.. ఈ రంగాన్ని కార్పొరేట్ సంస్థల పాలిట చేసి.. రైతులను బలివ్వబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేయటం ఏంటి.'
-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత