Congress Deeksha on Rahul Issue Today : రాహుల్ గాంధీ పట్ల మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్‌లో నిరసన దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాహుల్‌పై కుట్రపూరితంగా అనర్హత వేటు : అంతకుముందు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావ్ ఠాక్రేతో రేవంత్, ఉత్తమ్ సమావేశమై.. తాజా పరిణామాల వేళ చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, అదానీ వ్యవహారంపై పార్లమెంటు వేదికగా పదే పదే ప్రశ్నిస్తున్నందుకే రాహుల్‌పై కుట్రపూరితంగా వేటు వేశారని రేవంత్ మండిపడ్డారు. బీజేపీ నియంతృత్వ పాలనపై పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.
సేవ్ రాహుల్ - సేవ్ డెమోక్రసీ : మరోవైపు రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు హోరెత్తాయి. భాగ్యనగరంలోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని యువజన కాంగ్రెస్, మహిళా నాయకులు ముట్టడించడం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీగా వచ్చిన వారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ముషీరాబాద్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 'సేవ్ రాహుల్ - సేవ్ డెమోక్రసీ' నినాదంతో నిరుద్యోగ ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.