Congress CWC Meeting Arrangements in Telangana : ఈ నెల 17న విజయభేరి సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటించనున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. విజయభేరీ సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్ కోసం డిఫెన్స్ అధికారులను అడిగామని... కానీ బీజేపీ తమ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు కేంద్రం తరపున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. గచ్చిబౌలి స్టేడియం అడిగినా స్పోర్ట్స్ అథారిటీ తిరస్కరించిందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా తుక్కుగూడలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నామని.. కానీ దేవాదాయ భూములు ఉన్నాయని అందులో కూడా అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ జరిగితే బీఆర్ఎస్ పతనం ఖాయమని దేవుడిని అడ్డుపెట్టుకుని అనుమతి రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijayabheri Meeting Arrangements in Telangana : సభ నిర్వహించేందుకు తుక్కుగూడ రైతులే ముందుకొచ్చి తమ భూములు ఇచ్చారన్నారు. యుద్ధ ప్రాతిపదికన తమ పార్టీ నాయకులు భూములు చదును చేసి సభకు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇచ్చిన నాయకురాలు సోనియా వస్తుంటే.. ప్రభుత్వం సహకరించి విజ్ఞతను ప్రదర్శించాలే కాని.. దురదృష్టవశాత్తు ఆ విజ్ఞత మఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ప్రజాస్వామిక విలువలు కాపాడే ఆలోచన ఆయనకు లేదని ధ్వజమెత్తారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు ఒక హోటల్‌ను మాట్లాడుకుంటే.. మంత్రి కేటీఆర్ ఆ హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి కాంగ్రెస్‌కు ఇవ్వొద్దని చెప్పారని ఆరోపించారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
Revanth Reddy on CWC Meeting : ఈ నెల 16న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. 17న విజయభేరి సభలో 5గ్యారెంటీలను సోనియాగాంధీ ప్రకటిస్తారని ప్రకటించారు. ఖమ్మం సభకు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎలా విజయవంతం చేశారో.. ఆ సభ స్ఫూర్తిగా ఈ విజయభేరి సభకు లక్షలాది మంది యువకులు, రైతులు, నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు.