Rythu Sangharshana Sabha: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పరామర్శ, అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేందుకు... వరంగల్ డిక్లరేషన్ ముఖ్య ఎజెండాగా... హనుమకొండలో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభను నిర్వహిస్తోంది. ఇందుకోసం నగరంలోని... ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేతల కోసం ప్రధాన వేదికతోపాటుగా... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల కోసం, కళాకారుల కోసం... రెండు వేదికలను ప్రధాన వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. మైదానంలో రాహుల్‌గాంధీ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు... స్వాగత తోరణాలతో కళాశాలకు వెళ్లే మార్గం పూర్తిగా నిండిపోయింది.
వరంగల్ డిక్లరేషన్: సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీపీసీసీ... 15 రోజుల నుంచి విస్తృత ఏర్పాట్లు చేసింది. సభకు ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి... అధికారం కైవసం చేసుకునేందుకు... ఈ సభ ద్వారానే శ్రీకారం చుడతామని నేతలంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... రైతుల సంక్షేమం కోసం ఏం చేస్తామో చెప్పేందుకు... వరంగల్ డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ సభలో ప్రకటించనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి: రాహుల్‌గాంధీ ఇవాళ దిల్లీ నుంచి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు... శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని... అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 5 గంటల 45 నిమిషాలకు హనుమకొండకు వస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం వరంగల్ నుంచి రోడ్డుమార్గాన హైదరాబాద్ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు రాహుల్‌గాంధీ నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు రెండ్రోజుల పర్యటన ముగించుకుని... రాహుల్‌గాంధీ దిల్లీ బయలుదేరి వెళతారు.