తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళిత... గిరిజనుల లాకప్ డెత్‌లు పెరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరియమ్మ లాకప్ డెత్‌కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసైని వారు కోరారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రితంలు గవర్నెర్ తమిళసైని కలిసి ఫిర్యాదు చేశారు. అడ్డగూడూరు ఠాణా ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరియమ్మ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.
మరియమ్మ లాకప్ డెత్‌కి కారణం అయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. తల్లిదండ్రులు లేని ఆ కుటుంబానికి భూమి, ఆర్థిక సాయం ఇవ్వాలని కోరినట్లు భట్టి తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజనుల లాకప్ డెత్‌లు పెరిగాయని విమర్శించారు. దళిత, గిరిజనులకు బతికే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరియమ్మది పోలీసు హత్యానా, ప్రభుత్వ హత్యానా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులే హింస చేస్తే ఎవరికీ చెప్పుకోవాలని నిలదీశారు. గతంలో మంథనిలో లాకప్ డెత్ జరిగినా చర్యలు లేవన్నారు. పోలీసు యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగం వాడుకుంటుందని విమర్శించారు.