Congress Chevella Meeting :హైదరాబాద్లోని గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిఅధ్యక్షతన టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ (Chevella Congress Pubilc Meeting) నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని వివరించారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఖర్గే విడుదల చేస్తారని రేవంత్ స్పష్టం చేశారు.
ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ నెల 29వ తేదీన మైనారిటీ డిక్లరేషన్ (Minority Declaration) వరంగల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ క్రమంలోనే ఓబీసీ (OBC), మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామని తెలిపారు.
Revanth Reddy on Chevella Prajagarjana Sabha : ఈ సందర్భంగా తమ పార్టీ కార్యచరణను వివరించారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. అలాగే 'తిరగబడదాం.. తరిమికొడదాం' కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కో-ఆర్డినేటర్లను నియమించినట్లు రేవంత్ పేరొన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.