Congress Chevella Praja Garjana Public Meeting Today :శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహిస్తూ డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను ఆకట్టుకునే యోచనతో ముందుకెళ్తుంది. సీనియర్ నేతల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. శనివారంచేవెళ్లలో నిర్వహించనున్న ప్రజా గర్జన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించేందుకు హస్తం పార్టీ సర్వం సిద్ధం చేసింది.
Congress ST SC Declaration : రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉండడంతో అధికారంలోకి వస్తామన్న ధీమా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి మరింత ఊపునిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి చేయగలదో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా.. మరింత ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా సామాజిక వర్గాల వారీగా ప్రయోజనం చేకూర్చే పథకాలతో కూడిన డిక్లరేషన్లు తయారు చేయాలని నిర్ణయించింది.
Congress Public Meeting in Chevella : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే యువ, వ్యవసాయ డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించేందుకు సర్వం సిద్దం చేసింది. ఈ డిక్లరేషన్ తయారు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ నాయకుల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తెలుసుకునేందుకు ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం దిల్లీకి పిలిపించింది.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో హామీలు కూడా..: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సహా ఎస్సీ, ఎస్టీ సెల్ ఛైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి మెరుగైన ప్రయోజనం చేకూరాలంటే ఎలాంటి సహకారం అవసరం అన్న కోణంలో నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. దళితులకు, ఆదివాసీలకు మేలు చేకూర్చేందుకు అనువుగా ఉన్న హామీలను అందులో పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం.