దాదాపు 14 నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు, కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లనే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దయ్యాయని టీపీసీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy on farmers law) అన్నారు. రైతుల పోరాటాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతుల హక్కులను అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టాలని చూశారని ఆరోపించారు. రైతుల మరణాలు మోదీ హత్యలేనన్నారు. ఎన్ని రకాలుగా హింసించినా రైతులు వెనక్కి తగ్గలేదని కొనియాడారు. రైతుల విజయాన్ని కేసీఆర్ గొప్పగా తెరాస నేతలు చెప్తున్నారని విమర్శించారు.
అలుపెరగని పోరాటం చేసి అమరత్వం పొందిన 700 మంది కర్షక అమరవీరులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ నేతలు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరమ్మ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన(Congress candle rally in hyderabad) నిర్వహించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్‌లో కేంద్రానికి మద్దతు పలికిన కేసీఆర్.. ఇప్పుడేమో రైతుల పోరాటాన్ని తన విజయంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ కేసీఆర్ అని మండిపడ్డారు. రైతులపై కేసీఆర్‌కు (Revanth Reddy on CM KCR) ప్రేమ ఉండే కల్లాల్లో మగ్గిపోతున్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి గింజ కొనేవరకు పోరాటం చేస్తామన్నారు.
'14 నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాడారు. కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటం ఫలించింది. దేశంలోని 70 కోట్ల మంది రైతులకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ కేసీఆర్. రైతు చట్టాలను పార్లమెంట్‌లో సమర్థించిన కేసీఆర్.. మోదీ కంటే పెద్ద దోషి. ఈ రైతు చట్టాలను సమర్థించిన ఎవరైనా రైతు ద్రోహులే. శాసనసభలో రైతు చట్టాలను వ్యతిరేకించాలని తీర్మానం చేయాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బయట పడేశారు. రైతుల పోరాటాన్ని కేసీఆర్ ఖాతాలో వేసుకుంటున్న తెరాస నాయకులకు సిగ్గులేదా? కేసీఆర్‌కు నరేంద్ర మోదీ భయపడితే ధాన్యం ఎందుకు కొనడం లేదు? ఇవాళ తెలంగాణ రైతులు కల్లాల్లో చనిపోతుంటే పట్టించుకోరా? రైతుల ప్రాణాలకు తెగించి పోరాడితే.. వారి విజయాన్ని మీ ఖాతాలో వేసుకునేందుకు చూస్తున్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరు ఒక్కటే. పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు మద్దతు పలికారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టేందుకు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. రైతుల ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనాలి.